సురభి మెడికల్ కాలేజీలో షీ టీమ్ అవగాహన సదస్సు....

సీపీ రష్మి పెరుమాళ్....

సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి .....
సురభి మెడికల్ కాలేజీలో షీ టీమ్ అవగాహన సదస్సు....

ప్రజాస్వరం : సిద్దిపేట ప్రతినిధి, జూన్ 06  : 

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సురభి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ.బి. దుర్గ, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. లక్ష్మీబాబు, కళాశాల ఏఓ అమృత్ పాల్ సింగ్, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ వైద్యులు, పోలీసులు 24 గంటలూ ప్రజల సేవలో ఉంటారని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 'డిజిటల్ అరెస్ట్' పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పరిమితంగా పంచుకోవాలని, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సిమ్ కార్డ్, బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయాలని సూచించారు. ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో’ చెప్పాలని స్పష్టం చేశారు. సిద్దిపేటలో డీ-అడిక్షన్ సెంటర్ అందుబాటులో ఉందని, అవసరమైన వారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఫిర్యాదులు ఎలా చేయాలి అనే అంశాలను వివరించారు. అలాగే ప్రాథమిక ఆత్మరక్షణ పద్ధతులను వివరించారు.అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సీపీ తెలియజేశారు: డయల్ 100, షీ టీమ్ 8712667434, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ 1930, డ్రగ్స్ సమాచారం 1908.ఏ సమస్య ఎదురైనా తక్షణమే పోలీసులను సంప్రదించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీ రష్మి పెరుమాళ్ భరోసా ఇచ్చారు.