నీట్–2026 పరీక్ష పకడ్బందీగా నిర్వహణకు చర్యలు....
జిల్లా కలెక్టర్ కె. హైమావతి.....
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు మార్గనిర్దేశం....
ప్రజాస్వరం : సిద్దిపేట ప్రతినిధి, జూన్ 06 :
ఈనెల 21వ తేదీన జరగనున్న నీట్–2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు.శనివారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రద్దయిన నీట్–2026 పరీక్షను దేశవ్యాప్తంగా ఈనెల 21న నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు 96 శాతం పూర్తయ్యాయని, మిగిలిన కొనుగోళ్లను రెండు, మూడు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. 9వ తేదీన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల బస్సులను ప్రారంభించనున్నారని, జిల్లాల నుండి ఎస్‌హెచ్‌జీ మహిళలతో కలిసి బస్సులను పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌ల కోసం క్లాత్ త్వరలో జిల్లాలకు పంపనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో నీట్–2026 పరీక్షను పోలీస్ శాఖ సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 23 మండల సమైక్యలకు బస్సులు అందజేశామని, వాటిని సీఎం ప్రారంభ కార్యక్రమానికి ఎస్‌హెచ్‌జీ మహిళలతో కలిసి హైదరాబాద్‌కు పంపుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్‌ల తయారీకి మండలాల వారీగా స్టిచింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ, డీఎం సివిల్ సప్లై గోపికృష్ణ, డీసీఓ వరలక్ష్మి, డీఏవో స్వరూపారాణి, డీపీఓ రవీందర్, జిల్లా రవాణా శాఖ అధికారి జోగేశ్వర్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.


