సరైన పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ...
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు....
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 04 :
కొల్చారం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించే దిశగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, బీట్ వ్యవస్థ అమలు, నేరాల నివారణకు చేపడుతున్న చర్యలను సమీక్షించిన ఎస్పీ, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించాలని, సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్‌ఐ మోహినొద్దీన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


