ఆర్టీసీ బస్సు ఢీ కొని ముగ్గురు అక్కడికక్కడే ....
హవేలీ ఘనపూర్ మండలం చెందిన ముగ్గురు మృతి....
మెదక్, మార్చ్ 14 (ప్రజాస్వరం):
బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం కొల్చారం మండలం రాంపూర్ శివారులో జరిగింది. ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు మృతుల బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత గౌడ్ (50), అతని కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ (12) తన అల్లుడు బొగడ భూపతిపూర్ గ్రామానికి చెందిన సాయ గౌడ్ (35) తో కలిసి మండలంలోని రంగంపేటలో శనివారం జరిగిన తన కూతురి కుమారుడి తొట్టెల కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో మెదక్ హైదరాబాద్ 765 డి జాతీయ రహదారిపై రాంపూర్ శివారులో మెదక్ వైపు నుండి నర్సాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మోహినుద్దీన్ కేసు నమోదు చేసుకొని శవాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.


