విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్..
రిమాండ్ కు తరలింపు సిఐ వెంకట్ రాజు గౌడ్..
నార్సింగి, మార్చ్ 14 ( ప్రజాస్వరం ):
పాత కక్షలతో జీ.ఐ వైరు కు ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం, విషయం తెలియకుండా బట్టలు ఆరబెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన లో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు రామాయంపేట సీఐ వెంకట రాజు గౌడ్ తెలిపారు. శనివారం నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ బీమరి సృజన, సిబ్బందితో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీ.ఐ మాట్లాడుతూ అత్వెల్లి గ్రామం మేడ్చల్ మండలానికి చెందిన దండ శ్యాంసుందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నార్సింగి పట్టణ కేంద్రంలోని తన భార్య తరపు బంధువుల ఇంటికి పెళ్ళి కోసం వచ్చాడు. అయితే శ్యాంసుందర్ బంధువులు అయిన నాగరాణి, పక్కింట్లో నివాసం ఉండే తమ్మారెడ్డి భూపాల్ రెడ్డి కి పాత కక్షలు ఉన్నాయి. తమ్మారెడ్డి భూపాల్ రెడ్డి తన ఇంటి గోడకు ఉన్న జీ.ఐ వైర్ కు ప్రమాదమని, షాక్ వల్ల ప్రాణం పోతుందని తెలిసి కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి పెట్టాడు. ఈ క్రమంలో ఈ నెల ఆదివారం 8న ఉ 10:30 ప్రాంతంలో శ్యాంసుందర్ రెడ్డి అదే వైర్ పై బట్టలు ఆరబెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భూపాల్ రెడ్డి కి తమకు పాత కక్షలు ఉన్న నేపథ్యంలో మమ్ములను చంపాలన్న లక్ష్యం తోనే కావాలనే వైర్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడని, అతని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య భార్గవి, ఇంటి యజమాని నాగరాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న తమ్మారెడ్డి భూపాల్ రెడ్డి ని శనివారం అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని, భూపాలరెడ్డి పై సెక్షన్ 103 (1) ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సీ.ఐ వెంకట రాజు గౌడ్ తెలిపారు.


