ప్రాణరక్షణే ధ్యేయంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమలు

ప్రాణరక్షణే ధ్యేయంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమలు

ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు భద్రత సాధ్యం

రామాయంపేట్‌లో భారీ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

100 హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీ నిర్వహణ

జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్

ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ , మెదక్ ఎమ్మెల్యే రోహిత్  

రామాయంపేట. జనవరి. 22.( ప్రజాస్వరం ):

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్కూల్ గ్రౌండ్‌లో 100 హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు పాల్గొని, అనంతరం స్కూల్ గ్రౌండ్ నుండి వినాయక ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.అనంతరం రామాయంపేట్ వినాయక ఫంక్షన్ హాల్‌లో స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులకు భారీ ఎత్తున రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ , మెదక్ ఎమ్మెల్యే శ్రీ రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున దాదాపు 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, అందులో సుమారు 7500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గత ఏడాది సుమారు 800 మంది హత్యలకు గురైతే, అదే కాలంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 7500 మంది మరణించారని, అంటే హత్యలకన్నా పది రెట్లు ఎక్కువ మంది రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం తీవ్ర ఆందోళనకరమని అన్నారు.

2025లో ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ, మృతుల్లో 80 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళనకరమని, ముఖ్యంగా యుక్త వయసు యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని తెలిపారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హెల్మెట్ స్ట్రాప్ సరిగ్గా బిగించుకోవాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోలు నడపడం, ఓవర్‌లోడింగ్, హైబీమ్ లైట్లు వాడడం, ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం వంటి ఉల్లంఘనలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు.అదే విధంగా, రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు వెంటనే సహాయం అందించిన వారికి ప్రభుత్వం నుండి నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని, ప్రజలు ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని తెలిపారు.

ఈ సందర్బంగా మెదక్ ఎంల్ఏ మాట్లాడుతూ ప్రజలు వాహనాలు సురక్షితంగా వాహనాలు నడిపి తమ గమ్యాన్ని స్థానలను చేరుకోవాలని, దేశ వ్యాప్తంగా 4లక్షల ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయాని అందులో 1లక్ష 50 వెల మంది వరకు మరణిస్తున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. విద్యార్థులకు వారి తల్లీదండ్రులు రోడ్డు నియమాలు పాటించేలా కృషి చేయాలని అన్నారు. చివరగా విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ శ్రీ నరేందర్ గౌడ్, రామాయంపేట్ ఇన్‌చార్జ్ సీఐ శ్రీ రంగా కృష్ణ, ఆర్టీఓ శ్రీ వెంకట స్వామి, జిమ్మెర్ ప్రతినిధి శ్రీమతి షాలిని, మేనేజర్, ఎస్‌ఐ బాలరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.