బాధితుల గౌరవానికి రక్షణ – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు....

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు....

బాధితుల గౌరవానికి రక్షణ – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు....

పోలీస్ స్టేషన్‌ కు వెళ్లకుండానే ఫిర్యాదు.......

ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు....

దేశంలోనే తొలిసారి అమలులోకి వచ్చిన నూతన విధానం....

మెదక్ జనవరి 22 (ప్రజాస్వరం):

బాధితుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని మెదక్ జిల్లాలో అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాలికలు, మహిళలు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో వేధింపులకు గురవుతున్న అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో చాలా మంది బాధితులు భయంతో, మానసిక ఒత్తిడితో ఫిర్యాదు చేయలేకపోతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకే పోలీస్ శాఖ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మహిళలు, బాలికలు, పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటివద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం రాష్ట్ర పోలీస్ శాఖ కల్పించిందని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో పోలీసులే బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తారని వివరించారు. బిఎన్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం నేర సమాచారం అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ సహా ఏ రూపంలోనైనా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని, బాధితుల గౌరవానికి భంగం కలగకుండా సేవలు అందించడమే ఈ విధాన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా అమలులోకి వస్తోందని, దీని ద్వారా బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, శారీరక దాడులు, ర్యాగింగ్, బాల్య వివాహాల నిషేధ చట్టం కేసులు వంటి ప్రత్యేక నేరాల్లో ఈ ఎస్ఓపి అమలు చేస్తామని తెలిపారు. బాధితులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే స్పందించి, పోలీసులే ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాపీని బాధితులకు అందజేస్తారని చెప్పారు. అవసరమైన సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల నమోదు కూడా అక్కడికక్కడే చేపడతామని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నేరాలపై భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.