ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
గువ్వ రవి......
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం):
జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి కాలనీ వాసులు చేసినటువంటి ఆరోపణలు నిజం కావని గువ్వ రవి ముదిరాజ్ అన్నారు. శనివారం గువ్వ రవి ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. 1977లో స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే ఉమా వెంకట్ రెడ్డి పేదల కోసం స్థలం కొనుగోలు చేసి ల్యాండ్ ఆక్వాజేషన్ జరిపి 132 మంది పేదలకు ఇండ్ల స్థలాలను ఇచ్చారని చెప్పారు. అప్పటి ఎమ్మెల్యే ఉమా వెంకట్ రెడ్డి 5 ఎకరాల 36 గుంటల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయగా 5.7 ఎకరాల్లో ప్రభుత్వం ద్వారా ల్యాండ్ ఆక్వాజేషన్ చేయించి పేదలకు ఇండ్ల స్థలాల కేటాయింపు జరిపినట్లు తెలిపారు. మిగిలిన 27 గుంటల భూమిలోనుండి కొద్ది రోజుల అనంతరం 14 గుంటల భూమిని ఎస్టీ హాస్టల్ కు ఇచ్చారని అన్నారు. చివరిగా మిగిలిన 13 గుంటల పట్టా భూమి ఉమా వెంకట్ రెడ్డి పేరు పైనే ఉందని స్పష్టం చేశారు. 2007లో వీర్లపల్లి శ్రీలత, జంబుల నరసింహారెడ్డి ఉమా వెంకట్ రెడ్డి నుండి న్యాయబద్ధంగా స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. ఇదే విషయమై కొందరు స్థానికులు అదే సమయంలో కోర్టును ఆశ్రయించగా, పూర్తి డాక్యుమెంట్లను పరిశీలించిన కోర్టు అది ప్రభుత్వ స్థలం కాదని ప్రైవేట్ స్థలమని తీర్పునిచ్చినట్లుగా గువ్వ రవి ముదిరాజ్ మీడియా ముఖంగా వెల్లడించారు. 2017 సంవత్సరంలో వీర్లపల్లి శ్రీలత, నరసింహారెడ్డి ల వద్ద నుండి స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అసత్యపు ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన స్థానికులను అన్నారు. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని గువ్వ రవి ముదిరాజ్ మండిపడ్డారు.


