కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు ఆపాలి....

బీఆర్ఎస్ నేతల ధర్నా

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు ఆపాలి....

ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 01 (ప్రజాస్వరం):

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్నిఅవమానించడమేనని గులాబీ సైన్యం తీవ్రంగా ఖండించింది.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమై, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌పై ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయ వేధింపులకు దిగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హెచ్చరించారు.తెలంగాణ ఉద్యమ సారథిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని, అలాంటి నాయకుడిపై అక్రమ కేసులు, నోటీసులు ఇవ్వడం తగదని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు, నిర్బంధాలను గులాబీ సైన్యం ఎదుర్కొందని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని తెలిపారు.కేసీఆర్‌పై సిట్ విచారణ పేరుతో జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, మాజీ సర్పంచ్ పాండు రంగ్, నార్వడే రమేష్, షాబీర్, మతిన్, గణేష్, ప్రవీణ్, గణపతి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.