సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ....
కాంగ్రెస్ నాయకులు....
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :
రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంపు, నార్సింగిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు కు కృతజ్ఞతగా మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టీపీసీసీ సేవా దళ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్, ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ లు మాట్లాడుతూ గత 20సంవత్సరాలు గా నార్సింగి అభివృద్ధికి నోచుకోలేదని, స్వర్గీయ రామలింగ రెడ్డి రెండు పర్యాయాలు, రఘునందన రావు ఒక పర్యాయం దుబ్బాక ఎమ్మెల్యే గా చేసినా నార్సింగిలో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మించలేక పోయారని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి రెండున్నర ఏళ్ళు గడిచినా కూడా మండలాన్ని పట్టించుకోవడం లేదని, కనీసం తన ఎమ్మెల్యే నిధుల నుంచి అయినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని వాపోయారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ బస్ షెల్టర్ లేక ఇక్కడి ప్రజలు ఎండకు, వానకు పడుతున్న ఇబ్బందులను తీసుకుని వెళ్లగా తక్షణమే స్పందించి రోడ్డుకు ఇరువైపులా బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే డే కార్మికుల దినోత్సవం రోజున 1.11 కోట్ల మంది కార్మికులకు 10 నుంచి 20 శాతం కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అంతే కాకుండా జూన్ 2 న పెన్షన్ ల పెంపు, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబనికి 5లక్షల భీమా, ఇందిరమ్మ ఇండ్ల మలి విడత తో పాటు ప్రజలే ఆశ్చర్యపోయేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. నార్సింగి పట్టణానికి 96 ఇళ్లు మంజూరు కాగా 70 ఇల్లు పూర్తి కావస్తున్నాయని, అందులో కూడా అప్పటికప్పుడు నిరుపేదలకు నిర్మాణం కోసం సమయ సడలింపు కూడా ఇచ్చామని అన్నారు. మండలం లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తి పారదర్శకంగా జరిగిందని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఖచ్చితంగా అందుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుంటే చూస్తూ ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న వారిని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అన్నింటినీ పర్యవేక్షిస్తుందని, తగిన ప్రతిస్పందన ఇస్తుందని, విమర్శలు మానుకుని, పార్టీలను పక్కన పెట్టి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆటో జానీ, బాచి స్వామి, ధర్మాకర్ రాజేందర్, నరేష్ కుమార్, నాయకులు గోవర్ధన్, సుధాకర్, శంకర్ నాయక్, చందూ యాదవ్, మోతీలాల్, ప్రభాకర్, చిన్న బాబు, నర్సింలు గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


