కుల గణన చేపట్టాలని బీసీల ధర్మ పోరాట దీక్ష....

కుల గణన చేపట్టాలని బీసీల ధర్మ పోరాట దీక్ష....

మెదక్, సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) :

దేశ వ్యాప్తంగా జనగణన తో పాటు కుల గణన చేపట్టి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి జనగణనలో కులగణనను చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు ప్రస్తుతం తక్కువ రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమన్నారు. “మేమెంతో–మాకంత” నినాదంతో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గంగారాం, ఉపాధ్యక్షుడు మల్లేశం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల నరసింహులు, మెదక్ అసెంబ్లీ బీసీ సంఘం అధ్యక్షుడు సాప రవి, శ్రీదేవి, శభానా, సుంకోజ్ దామోదర్ చారి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.