ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!...
పద్మ దేవేందర్‌రెడ్డి....
మెదక్ బస్సు డిపో రోడ్డుపై బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ రాస్తారోకో.....
మెదక్ సెప్టెంబర్ 07 (ప్రజాస్వరం) :
ప్రజల తరఫున అసెంబ్లీ లో ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మెదక్ లో బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ బస్సు డిపో రోడ్డు పై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేస్తారా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం, వాటి అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షం బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను గేటు వద్దే అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి తదితర బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై గళం వినిపించాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే అసెంబ్లీలోకి రానివ్వకపోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తోందని విమర్శించారు.మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా అడ్డుకున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ని సజావుగా నడపాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం మానుకోవాలని, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ మరింత బలంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు చౌదరి చరిత, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల పాల్గొన్నారు.


