అంబేద్కర్ విగ్రహ... గద్దె కూల్చడం దురదృష్టకరం
ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి...
యువతపై నమోదు చేసిన కేసులు వెంటనే ఎత్తివేయాలి
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వాలి
గజ్వేల్, మార్చి 16 (ప్రజాస్వారం ):
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడని, ఆయన విగ్రహ ఏర్పాటుతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు. వర్గల్ మండలం నాచారం వద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దె కూల్చిన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడుగున నిలిచిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసి వర్గాల అభ్యున్నతికి కృషి చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేయగా, అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు చెప్పారు. అయితే అందరి ఆరాధ్యదైవమైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గద్దె నిర్మాణ నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేయడం భావ్యం కాదని పేర్కొంటూ రహదారికి సమీపంలో విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తూ సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. సున్నితమైన ఇలాంటి అంశాన్ని ఏకపక్ష నిర్ణయాలతో పరిష్కరించలేరని, అన్ని వర్గాలతో చర్చించి వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు త్వరితగతిన స్పందించి చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దండుగళ్ల కిషన్, జిల్లా అధ్యక్షులు ముకద్దo సుధాకర్, నాచారం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


