అక్రమంగా నిల్వచేసిన ఇసుక వేలంపాట....
80,500 రూపాయలకు దక్కించుకున్న గుర్రాల సుధాకర్.. తహసిల్దార్ గ్రేస్ బాయి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, జెసిబి సీజ్..
నార్సింగి, ఏప్రిల్ 31 ( ప్రజాస్వరం ):
మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇసుక బహిరంగ వేలంపాటను తహసీల్దార్ గ్రేసీబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో 8 మంది పాల్గొన్నారు, మొత్తం 25 ట్రిప్పుల ట్రాక్టర్ ఇసుకకు జరిగిన వేలం పాటలో చివరికి గుర్రాల సుధాకర్ రూ. 80,500 కు దక్కించుకున్నారు. నార్సింగి గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుండు చెరువు వాగు నుండి తీసిన ఇసుకను బాబు మేస్త్రి అనే వ్యక్తి స్థలంలో కుప్పలుగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మార్చి 30న ఉదయం 11:15 గంటలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని పంచుల సమక్షంలో ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇసుక కుప్పలకు సున్నంతో మార్కింగ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను మంగళవారం వేలం వేస్తామని తహసీల్దార్ ప్రకటించారు. అయితే, మార్చి 31 అర్ధరాత్రి సమయంలో శాలిపేట కు చెందిన బుస్స రాజు అనే వ్యక్తి సీజ్ చేసిన ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తస్కరించినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే స్థానిక ఎస్ఐ బీమరి సృజన పోలీసు సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించగా దాదాపు 10 ట్రాక్టర్ల మేర ఇసుకను తస్కరించినట్లు గుర్తించి, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక జే.సీ.బీ, మూడు ట్రాక్టర్లు ట్రాలీలతో సహా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను నార్సింగి తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణానికి తరలించారు. జీపీఓ మాసుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బీమరి సృజన, తహసీల్దార్ గ్రేస్ బాయి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు. అనంతరం తహసీల్దార్ గ్రేసీబాయి మాట్లాడుతూ వేలంపాటలో ఇసుకను కొనుగోలు చేసిన వ్యక్తి ఇసుకను తరలించే సమయంలో ట్రాక్టర్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకొని తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ఉదయం నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే ఇసుకను తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


