గిరిజనుల దేవత జంగుబాయి జాతర
సంబరాలలో ఆదివాసులు
దీపోత్సవంతో మొదలు
ఎనిమిది గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో ముందుగా దీపోత్సవంతో ప్రారంభిస్తారు. తుమ్రం, కొడప, సలాం,రాయిసిడాం, హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఎనిమిది గోత్రాల కటోడాలు (పూజరులు) తొలిరోజుకాలినడకన పూజా సామగ్రి తీసుకెళ్లి అదే రోజు రాత్రిదీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలుకొనసాగిస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో ఆదివాసీలుఉదయం తమ ఇండ్ల ముందు ఆవుపేడతో అలుకు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాళ్లకి చెప్పులు కూడా వేసుకోరు.నేలపైనే పడుకుంటారు. మద్యం అసలే ముట్టుకోరు.కనీసం హోటల్లో నీటిని కూడా ముట్టుకోరు. ఇంటినుంచి కాలినడకన ఆలయానికి చేరుకుం టారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సివస్తే గంపను నేలపై ఉంచ కుండా మూడు బండలనుపేర్చి గో మూత్రంతో శుభ్రం చేసిన తర్వాత రాళ్లపైపెడతారు.జాతరకు వెళ్తూ మధ్యలో టోప్లకస (కోనేరు)లో పుణ్యస్నానాలు చేసి ఆలయానికి చేరుకుంటారు.
నైవేద్య సమర్పణ
ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వులనూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వులనూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, ఆగరవర్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ,గులాలు, వంట సామగ్రి పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరంమైసమ్మ, పోచమ్మ, రావుర్క్ వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసిఆట పాటలతో అమ్మవారిని ఆరాధిస్తుంటారు.


