చట్ట ప్రకారం ప్రతి బాధితుడికి న్యాయం అందిస్తాం....
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు......
కుమారుడి వేధింపులపై ఎస్పీ సీరియస్.....
తక్షణ విచారణకు ఆదేశాలు.....
ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుంది.....
ప్రజాస్వరం : మెదక్, జూన్ 01 :
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వినిపించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో హాజరైన ఓ వృద్ధ దంపతులు తమ కుమారుడు తమపై దాడి చేస్తూ, సరైన ఆహారం అందించకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అత్యంత సీరియస్‌గా తీసుకుని, వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్‌ఐకి ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతోందని తెలిపారు.


