వెల్దుర్తిలో నీటి కష్టాలు.....
మహిళల ఆవేదన.....
ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 22 :
మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి.సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి ఒకటి రెండు బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి, వంటకు సరిపోతాయి. మరి స్నానాలు, బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలను స్థానాలకు అదే విధంగా బట్టలను ఉతకాలి. రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నాం" అంటూమహిళలుకన్నీటిపర్యంతమయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. "ఇల్లు కట్టించి ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. నీళ్ల సౌకర్యం లేకపోతే మేము ఎలా బతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణం" అని కాలనీవాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా చుక్క నీరు రావడం లేదని, అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం రెండు మూడు ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు.


