తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ కు నివాళి.....
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 21 :
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల.ఆంజనేయులు పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బిఆర్ఎస్ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సేవలు తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేడు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన జయశంకర్ సార్ పోరాటం, జీవితం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం, "మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు" అనే నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖుల్లో జయశంకర్ సార్ ముందు వరుసలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి. కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీది. క్రిష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ.మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.


