రీ-నీట్ పరీక్షకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు....

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు...

రీ-నీట్ పరీక్షకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు....

పరీక్ష కేంద్రం పరిసరాల్లో సెక్షన్–163 అమలు....

ప్రజాస్వరం : మెదక్, జూన్ 20  : 

 

రీ-నీట్ పరీక్ష (యూజీ)-2026 పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 న (ఆదివారం) మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీ-నీట్ పరీక్ష (యూజీ)-2026 పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్–163 అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడడాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. అలాగే పరీక్షా కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష పూర్తయ్యే వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి లేదా ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది, పోలీసు అధికారులు ఇచ్చే సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సెక్షన్–163 నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా ప్రజలు, తల్లిదండ్రులు, అభ్యర్థులు పరీక్ష ప్రశాంత నిర్వహణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.