లక్షలాది మందికి ఆశా కిరణాలుగా సత్య సాయి సేవలు....
సమానత్వం, శాంతి, సేవ ఆయన సందేశం....
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు....
మెదక్ నవంబర్ 23 (ప్రజా స్వరం)
సత్య సాయి 100 వ జయంతి సందర్బంగా ఆదివారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు సత్య సాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా వేలాది మందికి ఉచిత చికిత్స అందించడం విశేషమని, ఆరోగ్యం, విద్య, సేవ రంగాల్లో ఆయన స్థాపించిన సంస్థలు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఆశా కిరణాలుగా నిలుస్తున్నాయని అన్నారు. అదే విధంగా, సత్య సాయి భక్తులు అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారని, ఆయన బోధనలు మానవ విలువలు, సేవాభావం, సర్వజన హితం మీద ఆధారపడి ఉండటం వల్ల సమాజానికి సమానత్వం, శాంతి, సేవ అనే సందేశాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. అయన ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలను పొందిన ప్రముఖ హీరో కూడా ఉన్నారని అన్నారు. అనంతపూర్ జిల్లాలో దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి సత్య సాయి వాటర్ ప్రాజెక్ట్ ద్వారా భారీ స్థాయిలో నీటి సరఫరా చేసి లక్షలాది మందికి ఉపశమనం కలిగించడం ఆయన మహోన్నత సేవలో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐ లు రామకృష్ణ, శైలందర్, ఆర్ఎసై లు నరేష్, మహిపాల్, హరీష్ సిబ్బంది పాల్గొన్నారు.


