పనిభారం తగ్గించకపోతే ఏప్రిల్ లో ధర్నా, ఆపై సమ్మె తప్పదు....
జిల్లా అధ్యక్షులు కాల్వ చక్రధర్ హెచ్చరిక...
గజ్వేల్, 25 మార్చి (ప్రజాస్వరం) :
గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఆవరణలో "పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్" (3194) (ఐ.ఎన్.టి.యు.సి.) సిద్దిపేట జిల్లా 2వ కార్యవర్గ సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు శ్రీ కాల్వ చక్రధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాల్వ చక్రధర్ మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రాత్రింబవలు విధుల్లో నిమగ్నమై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ విధుల్లో 60 శాతం సమయం ఆన్లైన్, ఆఫ్ లైన్ పనులకే సరిపోతోందని, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత వల్ల పనిభారం పెరిగి సిబ్బంది శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆశా కార్యకర్తలు సమ్మెలో ఉన్న సమయంలో, కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే కోసం క్షేత్రస్థాయి సిబ్బందిని ఇంటింటికి వెళ్ళమనడం అసమంజసమని ఆయన మండిపడ్డారు. కుకునూరు పల్లి, దౌల్తాబాద్, అక్కన్నపేట, కొండపాక పీహెచ్‌సీల్లోని సమస్యలను త్వరలోనే జిల్లా కలెక్టర్ మరియు డీఎంహెచ్ఓ (DM&HO) దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
*ప్రధాన డిమాండ్లు:*
వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి మరియు సిబ్బంది రేషనలైజేషన్ చేపట్టాలి. నాడు ప్రకటించిన పీఆర్సీ (PRC) ని అమలు చేయాలి మరియు డీఏ (DA) బకాయిలను విడుదల చేయాలి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించి, వారికి రావాల్సిన 10 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి. మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలి. 36 రకాల ఆన్లైన్ యాప్స్, 36 రకాల రిజిస్టర్ల పేరుతో సిబ్బందిని వేధిస్తున్న అధికారుల తీరు మారాలి.
ఆందోళన బాటలో యూనియన్
న్యాయమైన కోర్కెలు తీర్చని పక్షంలో ఏప్రిల్ నెలలో జిల్లా వ్యాప్త ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె నోటీసు ఇచ్చి వైద్య సేవలను నిలిపివేస్తామని చక్రధర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాండవుల కుమారస్వామి, కాసుల రవీందర్ రెడ్డి, బి. శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ కార్యదర్శి భూంపల్లి రాజు, గౌరవాధ్యక్షులు చెరుకు భాస్కర్, ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాల్వ శోభ, గజ్వేల్ డివిజన్ నాయకులు ఆదిమూలం నారాయణ, దేవసాని వాసుదేవ్, జి. మంగ, మరియు పెద్ద సంఖ్యలో పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


