ఇందుప్రియాల్‌లో పీహెచ్‌సీ, జడ్పీ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి..

ఇందుప్రియాల్‌లో పీహెచ్‌సీ, జడ్పీ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి..

అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

దౌల్తాబాద్, ఫిబ్రవరి 2 ( ప్రజాస్వరం):

పాఠశాలలు, ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సోమవారం దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్, ల్యాబ్, ఇంజక్షన్ గదులను తనిఖీ చేసి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు.

కంటి చూపు సమస్యతో పీహెచ్‌సీకి వచ్చిన ఓ వృద్ధునితో మాట్లాడిన కలెక్టర్, దృష్టి లోపం అధికంగా ఉంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (జిజిఎచ్)కు రిఫర్ చేయాలని సూచించారు. ఆకుకూరలు ఎక్కువగా తినాలని, రాగి జావా సేవించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు. పీహెచ్‌సీ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతూ చెట్లకు నిత్యం నీరు పోయించాలని తెలిపారు.

అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకే కూర టమాటా పప్పు, హైస్కూల్‌లో పప్పుతో పాటు ఆలుగడ్డ టమాటా సరిపడినంత వండలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థుల హాజరు ప్రకారం భోజనం వండాలి కానీ మీ ఇష్టానుసారంగా వండి నిర్లక్ష్యం వహిస్తున్నారని పాఠశాల ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగినంత కూరగాయలు వండనందుకు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫోన్ ద్వారా ఆదేశించారు.

కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు సరిపడినంత పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

అనంతరం పాఠశాల కిచెన్ గార్డెన్‌ను పరిశీలించిన కలెక్టర్, కొత్తిమీర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలను నిత్యం కూరల్లో వినియోగించాలని సూచించారు. గార్డెన్‌లో కలుపు తొలగించి రోజూ నీరు పోయాలని వంట సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ గజ్జల కనకరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.