రవీంద్రభారతిలో డబిల్‌పురం పరశురాంకు 'దళితరత్న' అవార్డు...
మేడ్చల్, ఏప్రిల్ 6 (ప్రజాస్వరం) :
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జిహెచ్ఎంసి పరిధిలోని మేడ్చల్ సర్కిల్ కార్యాలయం పరిధిలో గల కిష్టాపూర్ గ్రామానికి చెందిన డబిల్‌పురం పరశురాం ప్రతిష్ఠాత్మకమైన ‘దళితరత్న’ అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
*18 ఏళ్ల అకుంఠిత దీక్షకు లభించిన గుర్తింపు :*
గత 18 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ, ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోకుండా జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న మేడ్చల్ జిల్లా యువసేన అధ్యక్షుడు డబిల్‌పురం పరశురాంకు దళితరత్న పురస్కారం లభించింది. గతంలో గ్రామ ఉపాధ్యక్షుడిగా, మేడ్చల్ మండల యువసేన అధ్యక్షుడిగా, మేడ్చల్ మండల అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు విశేష సేవలు అందించిన పరశురాం, ప్రస్తుతం జిల్లా యువసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఆయన చూపిన చొరవకు ఈ అవార్డు ఒక మకుటంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ సుదర్శన్ బాబు, ఎమ్మార్పీఎస్ జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్.వై. అశోక్, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ సమక్షంలో ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం డబిల్‌పురం పరశురాం మాట్లాడుతూ సమాజ సేవలో, ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కుల పోరాటంలో అలుపెరగని కృషి చేసినందుకు గాను తమకు ఈ గౌరవం దక్కడం పట్ల అవార్డు గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.


