గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల అందోళన...

గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల అందోళన...

ప్రజాస్వరం :  సికింద్రాబాద్ , జూన్ 05 :

 

రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు గాంధీ హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వైద్యులు, నర్సుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా స్పౌస్ (భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే) ప్రమాణాలను, అలాగే ఇతర ప్రాధాన్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, వైద్యులు సమర్పించిన రిక్వెస్ట్ బదిలీలను తక్షణమే మంజూరు చేయాలని, గుర్తింపు పొందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGGDA) కేంద్ర సంఘం కార్యవర్గం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జీవో నెం. 38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు సంఘం రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించబోరని స్పష్టం చేశారు. ప్రభుత్వం జీవో 38ను పూర్తిగా అమలు చేయకపోతే మరియు వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయవలసి వస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.