ఎయిర్ పోర్టు తరహాలో రైల్వేస్టేషన్.....
ప్రజాస్వరం : హైదరాబాద్, జూన్ 5 :
ప్రయాణికులకు ఆకర్షణీయమైన, సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణ అనుభూతిని అందించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో రెడీ అవుతోంది. దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పునరాభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పురోగతి ఫోటోలు, వివరాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేవలం ఒక రవాణా కేంద్రంగానే కాకుండా.. భవిష్యత్ అవసరాలను తీర్చే ఒక భారీ అంతర్జాతీయ హబ్‌గా మారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.ఈ ఆధునిక రైల్వే గేట్‌వే తెలంగాణ ప్రగతికి ప్రతిరూపమన్నారు. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంలో భాగమే ఈ సికింద్రాబాద్ స్టేషన్ మేకోవర్ అని చెప్పారు. స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును మొత్తం రూ.714.73 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రింబవళ్లు జరుగుతున్న ఈ పనులు ప్రస్తుతం 64 శాతానికి పైగా పూర్తయ్యాయని చెప్పారు. ప్రయాణికుల రాకపోకలకు వీలుగా విశాలమైన ప్రవేశ ద్వారాలు, సరికొత్త వెయిటింగ్ హాళ్లు రూపుదిద్దుకున్నాయి. రైళ్ల కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు తరహా అనుభూతిని ఇచ్చేలా అత్యాధునిక ఎయిర్‌కాన్‌కోర్స్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.స్టేషన్‌ను ఆధునికీకరించే క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం కింది ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రయాణం సులభతరం చేసేందుకు స్టేషన్‌లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారుల పార్కింగ్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు అధునాతన మల్టీలెవెల్ కార్ పార్కింగ్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా అత్యాధునిక స్కైవాక్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ ప్రాంగణంలో భారీగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల రక్షణ కోసం స్టేషన్ అంతటా అధునాతన హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు అమరుస్తున్నారు.ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కొన్ని విభాగాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి నిర్మించిన తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, ప్రయాణికుల రక్షణను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నూతన భవన నిర్మాణాలు వంద శాతం పూర్తయ్యాయి. వీటితో పాటు స్టేషన్‌కు దక్షిణం వైపున నిర్మిస్తున్న ప్రధాన అప్రోచ్ రోడ్డు పనులు కూడా విజయవంతంగా ముగిశాయి. ఈపునరాభివృద్ధి పనులన్నీ త్వరలోనే పూర్తికానుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే వన్-ఆఫ్-ది బెస్ట్ ఐకానిక్ స్టేషన్‌గా నిలవబోతోంది.


