వరంగల్ సభకు పాద యాత్రగా సిద్దిపేట నుంచి బయల్దేరిన ఉద్యమ కారులు, యువకులు....
జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు....
సిద్దిపేట, ఏప్రిల్ 25 (ప్రజాస్వరం) :
వరంగల్ లో ఈ నెల 27న జరుగనున్న భారీ బహిరంగ సభకు సిద్ధిపేట కు చెందిన వెయ్యి మంది విద్యార్థి, యువకులు పాదయాత్ర చేపట్టారు.సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాం పల్లి అమర వీరుల స్థూపం నుండి అమర వీరుల కు నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ పెహల్గంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దామని చెప్పి శ్రద్ధాంజలి ఘటించారు. ఈరోజు మన సిద్దిపేట నుండి పాదయాత్రగా బయలుదేరినటువంటి విద్యార్థి యువ మిత్రులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానని అన్నారు.
44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది 27వ తేదీన వరంగల్ లో జరగబోయే పార్టీ రజతోత్సవం కోసం స్వచ్ఛందంగా తరలివెళ్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినావాభావ సంబంధం ఉందని ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కైనా, 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన సందర్భమైన సిద్దిపేటకు పేగు బంధం ఉందని అన్నారు. పార్టీ పుట్టిన నాడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. గాలి బుడగ లాంటిది పాలపొంగు లాంటిదని అమాసకు పుట్టింది పున్నానికి పోతది అని కూడా అన్నారు. మనల్ని అన్న వాళ్లు ఆగమయ్యారు తప్ప పార్టీ ఆగం కాలేదన్నారు. చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచింది. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్, గాంధీల మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అని అన్నారు. అదే పద్ధతిలోకేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గార్లు ప్రజలందరికీ తెలంగాణ ఎందుకు అవసరమో బోధించారని చెప్పారు. సమైక్యవాదులపై, ఢిల్లీ పెద్దలపై పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని వివరించారు. 1969లో జరిగిన ఉద్యమంలో చాలామంది అమరులయ్యారు. ఎంతోమంది విద్యార్థులు మరణించారు. పోలీస్ కాల్పుల్లో 369 మంది చనిపోయారు. ఆనాటి హింసను దృష్టిలో పెట్టుకొని మలిదశ ఉద్యమంలో కేసీఆర్, గాంధీ చూపిన బాటలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారని తెలిపారు. 4 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షంమన్నారు. రాష్ట్ర సాధన కోసం, మన ఆత్మగౌరవం కోసం 14 ఏళ్లు పోరాటం చేశామని పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపామని అన్నారు. . అంతేకాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్.
తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన, ప్రజల మధ్యలో ఉండి కొట్లాడే పార్టీ బిఆర్ఎస్ మాత్రమే.ఈరోజు ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆరోజు లంకలో రావణుడు చేసే అరాచకాలను ఎదిరించడానికి రామదండు కదిలింది. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది. మూడు రోజులపాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గులాబీ దండు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి కదిలిందని అన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి అందరూ క్రమశిక్షణతో ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా నడవాలి. ఎవరికి చిన్న ప్రమాదం కానీ గాయం కానీ జరిగితే నా గుండె బాధపడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాను. పాదయాత్రలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను వివరించండి. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాను. వారి వారి గ్రామాల వారీగా, మండలాల వారీగా, పట్టణాల వారీగా టీములు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. మీకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తాం. కంటికి రెప్పలా చూసుకునేందుకు మన పార్టీ సీనియర్ నాయకులు మిమ్మల్ని పర్యవేక్షిస్తారని అన్నారు.