డిగ్రీ కాలేజ్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసిన తాహాసీల్దార్
నలంద డిగ్రీ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి... తూప్రాన్ తాహాసీల్దార్ విజయలక్ష్మి
తూప్రాన్, మే 1, (ప్రజాస్వరం) : నలంద డిగ్రీ కాలేజ్ యాజమాన్యంతో పాటు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తూప్రాన్ తాహాసీల్దార్ విజయలక్ష్మి ఎస్సై శివానందం కు ఫిర్యాదు చేశారు. గురువారం తూప్రాన్ లోని నలంద డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా కాలేజ్ యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కాలేజీకి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న తాహాసీల్దార్ విజయలక్ష్మి, పరీక్ష పర్యవేక్షకుడు (ఓయూ) సుదర్శన్ రెడ్డిలు కాలేజీకి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడడానికి ప్రయత్నించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.
కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆడిట్ గారితో మాట్లాడి బీఎస్సీ కంప్యూటర్స్ ఎగ్జామ్ పేపర్లను డౌన్లోడ్ చేసి ఎగ్జామ్ ప్రారంభించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభించాల్సిన పరీక్ష సుమారు 11:30 గంటల తర్వాత పరీక్ష ప్రారంభించినట్లు తెలిసింది. డౌన్ లోడ్ అనంతరం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలంద డిగ్రీ కాలేజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తూప్రాన్ ఎస్సై కి ఫిర్యాదు చేశామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ లేక కళాశాల కరస్పాండెంట్ల్లో ఎవరైనా ఒకరు వుండి పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఇద్దరు కుడా లేక పోవడం గమనార్హం.