ఇది మోదీ ప్రభుత్వం... ఎవరూ తప్పించుకోలేరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ , మే 1 ( ప్రజా స్వరం ) : ఉగ్రవాద పోరాటంలో భారత్‌కు అన్ని దేశాలు అండగా నిలుస్తాయని హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22వ 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్ర దాడిపై మొదటి సారి అయన ఓ సమావేశంలో స్పందించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయని పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోందన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రకటించిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రదాడికి పాల్పడినవారికి తగిన శిక్ష విధిస్తామని పేర్కొన్నారు. పిరికి దాడి చేసి.. అదో గొప్ప విజయంగా భావిస్తున్నారని అన్నారు. ఇది మోదీ ప్రభుత్వమని.. ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో భారతీయులే కాదు.. ప్రపంచమంతా భారత్‌తో నిలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.