నందగోకుల్ రోడ్డు.. పాపం ఎవరిది?...
పనులు పెట్టింది బీఆర్‌ఎస్.. బిల్లులు పెండింగ్‌లో పెట్టిందెవరు?
నందగోకుల్–చెల్మెడ కమాన్ రహదారి నిర్మాణం విషయంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పై మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హాఫిజ్ మొల్సాబ్ తీవ్రంగా స్పందించారు. రహదారి పనులు ప్రారంభించిన ఘనతను బీఆర్‌ఎస్ చెప్పుకుంటున్నప్పుడు, పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉంచిన బాధ్యతను కూడా ఆ పార్టీనే తీసుకోవాలని అన్నారు. “పనులు మీరు పెట్టారు.. అప్పులు మీరు చేశారు.. బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించాలని పాదయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం?” అని హాఫిజ్ మొల్సాబ్ ప్రశ్నించారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో పెద్ద మొత్తంలో బిల్లులు, బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని దశలవారీగా చెల్లిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో మిగిలిన ఆర్థిక భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం మోస్తోందన్నారు. నందగోకుల్ రహదారి విషయంలో వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే పనులను నిలిపివేసిందన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న సమయంలో రహదారి పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉంచారని బీఆర్‌ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేని పనిని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రల పేరుతో రాజకీయ అంశంగా మార్చడం ప్రజలు గమనిస్తున్నారని హాఫిజ్ అన్నారు. ఎవరి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి, బిల్లులు ఎప్పుడు పెండింగ్‌లో పడ్డాయనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తే స్వాగతిస్తామని, అయితే రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం తగదని సూచించారు. నందగోకుల్ రహదారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పాదయాత్రలతో రాజకీయ డ్రామాలు చేయడం కాదు.. గత పాలనలో రహదారి పనులు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు వివరించాలి. గత ప్రభుత్వం చేసిన బకాయిలను చెల్లిస్తూ అభివృద్ధిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.


