కోట మరమ్మతు పనులను పరిశీలించిన తహసీల్దార్ మాలతి....
చారిత్రక వైభవం చందంపేట గడికోట: పర్యాటక ఉత్సవాలకు ముస్తాబు..
తెలంగాణ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన చందంపేట గడికోట త్వరలో పర్యాటక ఉత్సవాలకు వేదిక కానుంది. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని ఈ చారిత్రాత్మక గడికోటను తహసీల్దార్ మాలతి, గ్రామ సర్పంచ్ నాయిని ప్రవీణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోట పునరుద్ధరణలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతు పనులను పర్యవేక్షించి, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి, సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ పాపన్నపేట సంస్థాన రాణి చందమ్మ పరిపాలనా కాలంలో ఈ అద్భుతమైన గడికోట నిర్మితమైందని గుర్తుచేశారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కోట ప్రాంగణంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. మన పూర్వీకులు మనకందించిన అరుదైన చారిత్రక సంపదను, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. గడికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తుల సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక యువకులు, అధికారులు పాల్గొన్నారు.


