వ్యక్తి అదృశ్యం ......కేసు నమోదు ఎస్ఐ భీమరి సృజన
నార్సింగి డిసెంబర్ 16 (ప్రజా స్వరం)
మరో వ్యక్తికి పాలుకు ఇచ్చిన తన గొర్రెలను చూడడానికి వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిందని నార్సింగి ఎస్ఐ బీమరి సృజన తెలిపారు. ఎస్ఐ సృజన తెలిపిన వివరాల ప్రకారం జప్తి శివునూరు కు చెందిన కంతి పోచయ్య (70) తన భార్య కంతి ఎల్లవ్వ తో పాటు ఉంటూ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత వారం క్రితం తన గొర్రెలను మేపడానికి అదే గ్రామానికి చెందిన మాలోత్ రాజు కు పాలుకు ఇచ్చాడు. పాలుకు ఇచ్చిన ఆ గొర్రెల మంద జోగిపేట/ఆందోళ్ గ్రామ పరిధిలో ఉన్నందువల్ల చూసి రావడానికి పోచయ్య ఈ నెల 15 న మధ్యాహ్నం 12 గం ప్రాంతంలో ఇంటి నుంచి జోగిపేట కు బయలుదేరాడు. బయలు దేరినప్పుడు అతని సెల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలి వెళ్ళాడు. మధ్యాహ్నమే బయలు దేరిన పోచయ్య రాత్రి వరకు కూడా చేరుకో లేదని మాలోత్ రాజు పోచయ్య కుటుంబ సభ్యులకు తెలిపాడు. పోచయ్య కోసం అన్ని చోట్లా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. పోచయ్య కు గత రెండు సం. క్రితం పక్షవాతం వచ్చి అప్పటి నుంచి మందులు వాడుతున్నాడని, అప్పుడప్పుడు జ్ఞాపక శక్తి లేనట్లు ఉండే వాడని కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. పోచయ్య చామన ఛాయతో, ఎత్తు 5 ఫీట్ల 6 అంగుళాలు అని ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తెలుపు రంగు చొక్కా, తెలుపు రంగు ధోవతి, తువ్వాల వేసుకున్నాడని తెలిపారు. పోచయ్య ఆచూకీ లభించిన వారు పోలీసులకు లేదా నార్సింగి ఎస్ఐ బీమరి సృజన కు 8712657938 నెంబరు పై సమాచారం అందించాలని కోరారు.


