ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి....

పద్మా దేవేందర్‌రెడ్డి....

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి....

మెదక్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం) :

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకోగా, ఆమె సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంతో పాటు ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమానికి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలాకాలంగా ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న ఉద్యోగుల డిమాండ్లను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి ఆమె సంఘీభావం తెలిపారు.