ఓయూలో ఏబీవీపీ నిరసన.....
ప్రజాస్వరం : హైదరాబాద్ , ఏప్రిల్ 15
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ మాట్లాడుతూ తాము దారిద్య్రరేఖకు దిగువనున్న పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు చెందినవారమని, మెరిట్ ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో దాదాపు పదివేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దాంతో సుమారు 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్స్ విడుదల కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు కుటుంబ ఆభరణాలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


