సిద్ధిపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 8 :
తెలంగాణలో మరో రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి రైలు స్టేషన్ పనులు దాదాపు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీవ్ రహదారికి పక్కనే, కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి దగ్గర్లో ఉండే ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం, కొత్త రైలు మార్గాలు, పాత రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. దీంతో తెలంగాణలో ఇప్పటికే పలు కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణాలు పూర్తై అందుబాటులోకి రాగా.. మరికొన్నింటి నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇక కొన్ని రైల్వే స్టేషన్‌లకు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ప్రముఖ దేవస్థానమైన కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి అతి దగ్గర్లో కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. అయితే కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని.. త్వరలోనే భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు.. లకుడారం - దుద్దెడ మధ్య రైల్వే శాఖ కొమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తోంది. ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 99 శాతం పూర్తి అయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం ఒక ట్వీట్ చేశారు. ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2024 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా.. రూ. 5.63 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించారు.ఇక రైల్వే ప్రయాణికుల కోసం ఈ కొమురవెళ్లి స్టేషన్‌లో పలు అత్యాధునిక వసతులను కల్పించారు. 450 మీటర్ల పొడవైన హై లెవల్ ప్లాట్‌ఫారమ్.. 5 షెల్టర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్లు, తాగునీటి వసతి.. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు స్పెషల్ మరుగుదొడ్లను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌కు మెరుగైన అప్రోచ్ రోడ్లు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ఆర్కిటెక్చరల్ ఎలివేషన్, మల్లన్న స్వామి, స్థానిక ప్రకృతి అందాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించారు.ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తులు మల్లన్న దేవాలయానికి సులభంగా, నేరుగా చేరుకునే అవకాశం కలగనుంది. రాజీవ్ రహదారికి (ఎస్‌హెచ్-1) సమీపంలో ఈ రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ప్రయాణం మరింత సజావుగా సాగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో రూపుదిద్దుకున్న ఈ కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ద్వారా తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా.. ఆధ్యాత్మిక పర్యాటకానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News
21 Jun 2026 11:46:28
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం.... పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల. ఆంజనేయులు... ప్రజాస్వరం : మెదక్ : జూన్ 21 : తెలంగాణ ఉద్యమానికి


