వర్గల్‌లో రూ.1,500 కోట్లతో ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ ప్లాంట్..

వర్గల్‌లో రూ.1,500 కోట్లతో ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ ప్లాంట్..

తొలి దశ యూనిట్‌కు మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ..

వేయి మందికి కొత్తగా ఉపాధి... 2027 నాటికి 11 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం...

విదేశాలకు ఎగుమతి కానున్న ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఫ్రీజ్-డ్రైడ్ ఇన్‌స్టంట్ కాఫీ...

వర్గల్, నవంబర్ 26 (ప్రజాస్వరం):

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో సుమారు రూ.1,500 కోట్లతో రెండు దశల్లో ‘ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌స్టంట్ కాఫీ’ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఏటా 5,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తొలి దశలో ఏర్పాటు చేయబోయే యూనిట్ కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్‌’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సంస్థల విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ముఖ్యంగా... ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అధునాతనమైన ‘రోటో టెక్నాలజీ’ని ఈ ప్లాంట్ లో వినియోగిస్తున్నారన్నారు. కొత్తగా వేయి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. అత్యాధునిక ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ తయారీ సాంకేతికతలో స్థానిక యువత, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. 2027 చివరి నాటికి ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. యూరప్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, సీఐఎస్ తదితర దేశాలకు ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఫ్రీజ్-డ్రైడ్ ఇన్‌స్టంట్ కాఫీ ఎగుమతి అవుతుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ తాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.