హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు - వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి వెల్లడి
హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు-
జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి వెల్లడి
వికారాబాద్, ఆగస్టు 13 (ప్రజాస్వరం):
2012 సంవత్సరంలో వికారాబాద్‌లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి బుధ వారం జీవిత ఖైదు విధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
2012 సంవత్సరంలో వికారాబాద్ పట్టణంలోని బీటీఎస్ కాలనీకి చెందిన మిర్యాల భాగ్యలక్ష్మిని ఆమె భర్త మిర్యాల రాజు మరియు అతని పెదనాన్న కుమారుడు మల్లేశం కలిసి దారుణంగా హత్య చేశారు. మిర్యాల రాజు జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసయ్యాడు. తన సొంత ఇంటిని అమ్మాలని ప్రయత్నించగా, భార్య భాగ్యలక్ష్మి పిల్లల భవిష్యత్తు కోసం ఇంటిని అమ్మవద్దని అభ్యర్థించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు, మల్లేశంతో కలిసి 29.05.2012న భాగ్యలక్ష్మి మెడకు కేబుల్ వైర్ చుట్టి హత్య చేశారు.
ఈ ఘటనపై మృతురాలి తల్లి కుర్వ కిష్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ లచ్చి రామ్ గారు క్రైమ్ నంబర్ 143/2012, సెక్షన్ 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో సమగ్ర దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల ఆధారంగా గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి వాదోపవాదనలు విని, నిందితులు మిర్యాల రాజు, మల్లేశంలను దోషులుగా నిర్ధారించారు. నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి జీవిత ఖైదుతో పాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోజు తుది తీర్పు వెలువరించారు.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు మరియు ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి గ అభినందించారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. సుధాకర్ రెడ్డి, మొదటి దర్యాప్తు అధికారి లచ్చిరామ్, అప్పటి ఎస్ఐ శ్రీనివాస్, ప్రస్తుత వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ భీమ్ కుమార్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎల్. నరేందర్ మరియు లైజన్ ఆఫీసర్ బి. వీరన్న (ఎస్‌ఐ)లను ఆయన పేరు పేరునా ప్రశంసించారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.